నేరం అనేది అనాదిగా మానవ సమాజాన్ని వేధిస్తోన్న సమస్య. కాలానికి ప్రాంతానికి ప్రజల విలువలకు అనుగుణంగా దాని రూపాలు మారుతూ ఉండవచ్చు. అయితే సమాజంలోని ఏ ఒక్క వర్గమూ నేరం చేయడమే జీవనోపాధిగా ఎంచుకోదు. ఆంగ్లేయుల పాలనలో దురదృష్టవశాత్తూ కొన్ని తెగలను వారి పుట్టుక ఆధారంగానే నేరస్థులుగా ముద్రించే తప్పుడు విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. దీని ఫలితంగా ఈ ''నేరస్థుల'' పునరావాసానికి కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి ఒక పునరావాస కేంద్రమే ''స్టూవర్టుప్పురం.’ తెలుగు సాహిత్యం సినిమా రంగం స్టూవర్ట్ పురం గురించి అవాస్తవాలను కల్పిత కథలను ప్రచారం చేయడం ద్వారా తీవ్ర అన్యాయానికి పాల్పడ్డాయి. ఈ తప్పుడు చిత్రీకరణలు స్టూవర్టుప్పురం సమాజాన్ని మరింత అవమానకరంగా చూపించి వారిని సామాజికంగా మినహాయించే పనిచేశాయి. అయితే ''లోహముద్ర'' అనే ఈ నవల నిజానికి అద్దం పడుతుంది. ఇది స్టూవర్టుపురం చరిత్రను నిజాయితీగా చూపించిన విలువైన పుస్తకం. ''స్టూవర్ట్ పురం'' స్థాపన నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తుంది. ఈ నవల చదివితే స్టూవర్టుప్పురం ప్రజలు ఎలా నేరస్థులనే ముద్ర నుండి బయటపడి వివిధ రంగాలలో రాణించారో తెలుస్తుంది.