ప్రపంచ భాషల్లోనే తెలంగాణ నుడికారానికి ఒక సవ్వడి. డప్పు మోగినట్టు అందెలు గలగలలాడినట్టు ఫలవంతమైన చెట్టు ఊగినట్టు నదుల అలలు కిలకిలారావాలు చేసినట్టు అదొక జీవన సవ్వడి. అది తెలంగాణలో జీవించి తెలంగాణలో పర్యటించి తెలంగాణం అనుభవిస్తేనే ఆ అభివ్యక్తి సాధ్యము. మల్లయ్య గారు ఒక యోధుడిలా ఈ కర్తవ్యాన్ని నిర్వహించాడు నిర్వహిస్తున్నాడు. ఆయనకు తెలంగాణ సామాజిక చరిత్రమీద బలమైన పట్టు ఉంది. కరీంనగర్ అంటే పోరాటాల గడ్డ. ప్రజలు నిజాయితీ పరులు. ఎందరో సాయుధులకు ఆసరా ఇచ్చిన తల్లులున్న గడ్డ. కాలువ మల్లయ్య గారిది తల్లి హృదయం. ఆయన ప్రతి పాత్రలోనూ ఓ తల్లి కనబడుతుంది. బాంచెన్ దొరా! కాల్మొక్త అనే భావజాలంతో మొదలైన ఈ నవల తెలంగాణ జీవితంలోని సామాజిక ఆర్థిక సాంస్కృతికాంశాల నెన్నింటినో మనముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా మాదిగలు తెలంగాణ (భారతదేశ) సామాజిక నిర్మాతలు. ఒక బర్రె తోలుతో దానిమీద రసాయనిక చర్యలు చేసి దానితో చెప్పులు కుట్టి బూట్లు కుట్టి ఆరె కుట్టి మొత్తం వ్యవసాయ సంస్కృతికి మూలమైన పరికరాలన్నీ అందించిన ఉత్పత్తి కులం. చెప్పులు కుట్టే ఒక జీవనక్రమం నుంచి ప్రారంభమై అంబేద్కర్ ఆలోచనా విధానంలో విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక రంగంలో ఆధిపత్యానికి వెళ్ళే వరకు వెళ్ళిన కథనాన్ని అద్భుతంగా చిత్రించారీ నవలలో. ఈ నవలకు కాలువ మల్లయ్య రచనలకు పద్మశ్రీ అవార్డు తప్పక రావాలని నా అభిప్రాయం. దళితులందరు ఈ నవలను స్వంతం చేసుకొని ఈ దేశ నిర్మాతలుగా సంస్కృతీ నిర్మాతలుగా మనపాత్ర ఏంటో కర్తవ్యమేంటో తెలుసుకోవాలి. కాలువ మల్లయ్య ఒక ప్రబోధకుడిగా కూడా ముందుకొచ్చారు. ఈ రచయిత నవలలను రచనలను కేవలం రచనగా కాక సామాజిక ప్రయోజనం కోసం రాయడం ఆయనలోని తాత్త్విక దృక్పథానికి నిదర్శనం. ఇందుకు కాలువ మల్లయ్య గారిని నేను ఒక రచయితగానే కాక ఒక దళిత ఉద్యమ నేతగా కూడా అభినందిస్తున్నాను. - డా.కత్తి పద్మారావు
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.